ప్రత్యేక ప్రతినిధి

జగన్ మోహన్ రెడ్డి 2019లో భారీ మెజారిటీతో గెలిచారు, మళ్లీ వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. 

2019 లో ఆయన గెలుపుకి కారణాలేంటి? మళ్లీ గెలిచే అవకాశాలు ఎందుకున్నాయి? ఏ రకమైన రాజకీయ, సామాజిక ఫార్ములా జగన్ గెలుపుకి దోహదం చేస్తోంది?

దీనికి ప్రధాన కారణం ఏపిలో పెద్ద సంఖ్యలో ఉన్న క్రిస్టియన్ ఓట్లు అంటూ తాజాగా స్వరాజ్య అనే పత్రికలో వచ్చిన విశ్లేషణ వచ్చింది. స్వరాజ్య ఆరెస్సెస్ భావజాలానికి దగ్గర. అంటే బిజెపికి కూడా దగ్గర. అందువల్ల ఈ వ్యాసంలో రచయిత ఏం చెబుతున్నారు అనేదానికి ప్రాధాన్యత ఉంది.

సామాజిక మార్పులు రాజకీయాల్లో ఎలా ప్రభావం చూపిస్తాయి, ఐడెంటిటి పాలిటిక్స్ జగన్ కి ఏ విధంగా ఎన్నికల విజయాలకి దోహదం చేస్తున్నాయి అనే విషయాలని అర్థం చేసుకోవటానికి ఈ వ్యాసం ఉపయోగపడుతుంది.

జగన్ క్రిస్టియన్ ఓటు సహాయంతోనే గెలుస్తున్నాడు అంటే అసంబద్ధంగా అనిపించవచ్చు. ఎందుకంటే 2011 జనాభా లెక్కల ప్రకారం, విభజన అనంతర ఆంధ్రప్రదేశ్ లో క్రిష్టియన్ల జనాభా ఒక్క శాతం మాత్రమే. ఇంత తక్కువ జనాభా ఎన్నికల్లో ఇంత  ప్రభావాన్నిచూపగలదా అనే అనుమానం రావచ్చు. కాని దానికంటే ముందు వచ్చే అనుమానం, అసలు రాష్ట్రంలో క్రిష్టియన్ల జనాభా ఒక్క శాతం మాత్రమేనా?

ఇందులో ఏదో తేడా ఉంది అని ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది.

వాస్తవం ఏంటంటే, కొన్ని దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ లో క్రిష్టియన్ల జనాభా లెక్కింపులో పెద్ద ఎత్తున లోటుపాట్లు ఉన్నాయి. నిజానికి ఏపిలో క్రిష్టియన్ల సంఖ్య కనీసం ఐదో వంతు ఉంటుంది. నాలుగో వంతు ఉండే అవకాశం ఉందని కొంత మంది ఉద్దేశం. జనాభా లెక్కల్లో కంటే ఏపిలో క్రిష్టియన్ల వాస్తవ జనాభా చాలా ఎక్కువ అనే విషయం ఒకరకంగా ఆ రాష్ట్రంలో ఓపెన్ సీక్రెట్.

ఈ సందర్భంగా ఈ వ్యాస రచయిత వేణుగోపాల్ నారాయణన్ గారు ఒక లెక్క చెప్పారు. ఇదే స్వరాజ్య పత్రికలో గతంలో ఈ అంశానికి సంబంధించి వచ్చిన ఒక వ్యాసాన్ని ఆయన ఉదహరించారు.

2021 లో సి సురేంద్రనాద్ అనే ఆయన ఈ వ్యాసాన్ని రాశారు. ఏపిలో ఎన్ని చర్చిలు ఉన్నాయి అనే దానితో పాటు, జగన్ ప్రభుత్వం ఎంత మంది పాస్టర్లకి జీవన భృతి కల్పిస్తోంది అనే అంశాలని ప్రాతిపదికగా తీసుకుని, ఏపిలో అసలు ఎంతమంది క్రిస్టియన్లు ఉన్నారు అనే దాని మీద పరిశోధన చేశారు. ఆయన లెక్క ప్రకారం, ఏపిలో ప్రతి 18 గ్రామాలకి ఒక పెద్ద చర్చి ఉంది.

ఆయన ఈ అంశాలన్నిటిని తీసుకొని లెక్కగట్టినదేంటంటే, ఆంధ్రప్రదేశ్ లో క్రిస్టియన్ల సంఖ్య 12 నుంచి 25 శాతం మధ్యలో ఉండే అవకాశం ఉంది అని.

అలాగే డాక్టర్ జె కె బాలాజీ అనే ఆయన ఈ విషయం మీద 2016లో చేసిన పరిశోధనలో కూడా ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ అనే సంస్థకి చెందిన ఈయన 1911 నుంచి 2011 వరకు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన జనాభా గణనని పరిశీలించాడు. దీని ప్రకారం, ఒక ఆసక్తికర పరిణామం వెల్లడైంది. అదేంటంటే, ఆంధ్రప్రదేశ్ లో క్రిస్టియన్ జనాభా 1911 నుంచి 1971 వరకు పెరుగుతూ వచ్చింది. కాని, ఆ తర్వాత నుంచి, అంటే 1971 నుంచి, జనాభాలో క్రిస్టియన్ల శాతం తగ్గుతూ వచ్చింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1971లో 4.2 శాతం మంది క్రిస్టియన్లు ఉంటే, 2011లో జరిగిన జనాభా గణన ప్రకారం 1.3 శాతం మందే ఉన్నారు. వాస్తవ పరిస్థితుల్ని ఈ లెక్కలు ప్రతిబింబించడం లేదని ఎవరికైనా తెలిసిపోతుంది.

ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఉమ్మడి రాష్ట్రంలో క్రిస్టియన్ల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తూ ఉంటే, దళితుల జనాభా అదే సమయంలో పెరుగుతూ వెళ్లింది. దీనికి ప్రధాన కారణం అందరికీ తెలిసిందే. రాజ్యాంగం కల్పించిన హక్కులు దళితులుగా కొనసాగితేనే లభిస్తాయి. క్రిస్టియన్లగా మతం మార్చుకుంటే వాటిని కోల్పోవాల్సి వస్తుంది. అందువల్ల 1970 వ దశకం నుంచి మతంతో సంబంధం లేకుండా దళితులుగా కొనసాగడానికి ఎస్సీలు మొగ్గుచూపారు.

ఇందుకు గుంటూరు జిల్లానే ఉదాహరణగా తీసుకోవచ్చు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 1961లో 5.2 శాతం ఎస్సీలు ఉన్నారు. 13.4 శాతం క్రిస్టియన్లు ఉన్నారు. ఇరువురు కలిపి 18.6 శాతం ఉన్నారు. 2011 నాటికి ఈ శాతాలు మారిపోయాయి. ఎస్సీలు 5.2 శాతం నుంచి 19.6 శాతానికి పెరిగారు. క్రిస్టియన్లు 13.4 శాతం నుంచి 1.8 శాతానికి తగ్గారు. ఇరువురు కలిపి ఉమ్మడి గుంటూరు జిల్లాలో 21.4 శాతం మంది ఉన్నారు.

వీరుకాక, ఇతర కులాల నుంచి, మతాల నుంచి క్రిస్టియానిటి లోకి మారిన వారు కూడా ఉంటారు. దీన్నిబట్టి రాష్ట్రంలో క్రిస్టియన్ల సంఖ్య ఐదో వంతు కంటే ఎక్కువ ఉంటుంది అనే విషయం స్పష్టం. వీరి మద్దతే జగన్ మోహన్ రెడ్డి విజయ రహస్యం అని స్వరాజ్య లో వచ్చిన ఆర్టికల్ చెప్తోంది. దీంతోపాటు, బిజెపికి మద్దతు ఇవ్వడం వల్ల టిడిపి కోల్పోయిన ముస్లిం ఓటు కూడా జగన్ కి కలిసి వచ్చింది అని ఈ రచయిత చెబుతున్నాడు.

ఆంధ్రప్రదేశ్ లో క్రిస్టియన్, ముస్లిం, ఎస్సీ, ఎస్టీ జనాభా ఎంత ఉంది అని జిల్లాల వారీగా చూస్తే, కర్నూలు, కడప, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో 35 నుంచి 40 శాతం ఉంది. అనంతపూర్, చిత్తూరు, ప్రకాశం, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం జిల్లాల్లో 25 నుంచి 35 శాతం ఉంది. మిగిలిన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో 15 నుంచి 25 శాతం ఉంది.

అంటే ఈ ఓటే 35 నుంచి 40 శాతం జగన్ కి సాలిడ్ గా ఉంది. ఇది కాకుండా రెడ్డి వర్గంలో కూడా జగన్ కి మద్దతు ఉందనేది తెలిసిన విషయమే. దీన్ని బట్టి, జగన్ కి ఆటోమేటిక్ గా 40 శాతం ఓటింగు వస్తుంది.

అందువల్లే కాంగ్రెస్ ని అంత సులభంగా జగన్ 2014లో రిప్లేస్ చేయగలిగాడు అని ఈ వ్యాసరచయిత అంటున్నాడు. 2019 ఎన్నికలనే తీసుకుంటే, ఏపిలో ఉన్న 29 ఎస్సీ నియోజకవర్గాల్లో 28 చోట్ల వైఎస్సార్సీపి గెలిచింది. అలాగే, 7 ఎస్టీ సీట్లలో ఏడూ వైసిపియే గెలిచింది. రెడ్డి వర్గం ఆధిక్యం ఉన్నచోటా ఎలాగూ వైసిపి గెలుస్తుంది. ఈ రకమైన identity politics ఫార్ములాతోనే జగన్ గతంలో గెలిచాడు, ముందు ముందు కూడా విజయాలు సాధిస్తాడు అని వేణుగోపాల్ నారాయణన్ ఈ వ్యాసంలో వాదిస్తున్నాడు.

ఈ నేపధ్యంలో, బిజెపితో పొత్తు పెట్టుకుంటే, కొత్తగా కొన్ని వర్గాల ఓట్లని టిడిపి ఆకర్షించగలదని, లేకపోతే జగన్ కి తిరుగు ఉండదని ఆయన భావన.