బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా శ్రీకాళహస్తిలో జగన్ ప్రభుత్వం మీద చేసిన ఘాటు విమర్శలు గట్టిగానే తగిలాయి. అందుకే కాబోలు కొడాలి నానికి దీటుగా బూతులు మాట్లాడగల మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని (పేర్ని వెంకట్రామయ్య) ని వైసిపి రంగంలోకి దించింది.

ఆయన తన సహజ శైలిలో బిజెపిని, కేంద్ర ప్రభుత్వాన్ని దునుమాడేశారు. “అడ్డంగా ఉన్న నడ్డా గారు” అంటూ హేళన చేశారు. ఏపిలో బిజెపికి ఒక్క సీటు కూడా రాదని ప్రకటించారు.

వైసిపి భూకుంభకోణాల గురించి నడ్డా అన్న మాటల్ని ప్రస్తావిస్తూ, ల్యాండ్ స్కామ్‌ అంటే విశాఖ స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణే అన్నారు. కర్ణాటకలో కుక్కచావు చచ్చిన తర్వాత ఇక్కడకి వచ్చారా అని ప్రశ్నించారు. పచ్చ పువ్వులతో నిండిన బీజేపీ కాస్తా టీజేపీగా (తెలుగుదేశం జనతా పార్టీ?) మారిందని ఎద్దేవా చేశారు. పేదలకు రూ.2.16 లక్షల కోట్లు అందించిన ఘనత సీఎం జగన్‌ ది అయితే, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇందులో సగం డబ్బయినా ఇచ్చారా అని కడిగి పారేశారు. 

అమరావతిని పెద్ద ల్యాండ్ స్కాం అన్నది మీరే కదా, మరి ఇప్పుడు ఎందుకు స్వరం మారిందని ప్రశ్నించారు. ఇసుక ఫ్రీ అంటూ వేల కోట్లు దోచుకున్నది టీడీపీ, బీజేపీ పెద్దలేనని చెప్పారు. గతంలో రూ.4 వేల కోట్ల ఆదాయం రావాల్సిన ఇసుక డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో నడ్డా గారే చెప్పాలన్నారు. 

సీబీఐ ఏ స్థితిలోకి వెళ్లిపోయిందో దేశంలో ఏ రాజకీయ పార్టీని అడిగినా చెబుతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీ ఏలుతున్న రాష్ట్రాల్లో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉందో తెలీదా అని అడిగారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎంత హింస ప్రజ్వరిల్లుతోందో కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందని విమర్శించారు. 

‘ఆంధ్రుల హక్కు విశాఖ’ ఉక్కు పీక కోద్దామనే ప్రయత్నాన్ని బిజెపి ప్రభుత్వం చేస్తోందన్నారు. “దాంట్లో భూ స్కాం ఉందేమో, లేకపోతే దానికి క్యాప్టివ్ మైన్ ఎందుకు ఇవ్వరు. అదానీకి, వేదాంతకు ఇస్తారు, మా విశాఖ ఉక్కుకు ఎందుకు ఇవ్వరు?” అని ప్రశ్నించారు.

మొత్తానికి బిజెపి బట్టలిప్పినంత పనిచేశారు పేర్ని నాని. మంత్రి పదవి పోయిన తర్వాత ఆయన ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారనేది వాస్తవమే. ప్రస్తుతానికి తన కొడుక్కి సీటు కోసం తంటాలు పడుతున్నారు. అందుకే జగన్ మెచ్చుకోళ్ల కోసం ఆయన ఈమధ్య కాలంలో నోరుజారుతున్నారు.

అయినా సజ్జల రామకృష్ణారెడ్డి వంటి పార్టీ పెద్దల ఆదేశం లేకుండా బిజెపి మీద దాడి చేయగల ధైర్యం పేర్ని నాని చేయగలరా అనేది సందేహమే. వైసిపి నాయకత్వం మాత్రం అంత దుడుకుగా బిజెపిపైకి ఎందుకు ఎగబడుతుంది అనేది మరొక అనుమానం. బిజెపి నాయకత్వం తలుచుకుంటే జగన్ ని, ఆయన ప్రభుత్వాన్ని తమ కాళ్ల దగ్గరకి తెచ్చుకోవడం పెద్ద పని కాదు.

అందుకనే ఇదంతా ఎన్నికల సీజన్లో జరుగుతున్న మ్యాచ్ ఫిక్సింగ్ అని చాలామంది నమ్ముతున్నారు. మరి ఉత్తుత్తి పోట్లాటకే ఇంతంత మాటలన్నారా పేర్ని నాని గారు అనే ప్రశ్న కూడా ఉంది. రాబోయే రోజుల్లో ఈ అంశం మీద మరింత క్లారిటి వస్తుంది.