Admin

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి నమ్మదగిన మిత్రుడిగా జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్సీ మరోసారి నిరూపించుకుంది. మణిపూర్ లో జరిగిన ఘటనలకు నిరసనగా నరేంద్రమోడి ప్రభుత్వంపై ఇండియా కూటమి తరఫున ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి తమ మద్దతు ఉండదని వైసిపి పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు.

‘అంతా బాగా జరుగుతోంది. ఈ సమయంలో అవిశ్వాస తీర్మానం ఎందుకు,’ అని ఆయన ఏ ఎన్ ఐ  వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. పార్లమెంటు అవిశ్వాస తీర్మానాన్ని తాము వ్యతిరేకిస్తామని కూడా చెప్పారు. మణిపూర్ అంశం మీద హోం మంత్రి అమిత్ షా మాట్లాడటానికి ఒప్పుకున్న తర్వాత కూడా పార్లమెంటుని స్తంభింపజేయటం సరికాదని కూడా అన్నారు. 

బిజెపి ప్రభుత్వాన్ని ఇటువంటి కీలక అంశం మీద ఎదిరించే ధైర్యం వైఎస్సార్సీకి లేదని అందరికీ తెలుసు. అయితే, వివేకా హత్య కేసులో జగన్ పార్టీని సిబిఐ ఇరికిస్తోందని, దీనికి బిజెపికి జగన్ అంటే పడకపోవడం వల్లనేననే అర్థం వచ్చేలా ది వైర్ వెబ్ సైట్ ఈ మధ్య ఒక కథనం రాసింది. అంటే, బిజెపి దగ్గర తాము బిజెపికి విధేయులమని, బిజెపి వ్యతిరేకుల దగ్గర తాము బిజెపి బాధితులమని వైసిపి చెప్పుకోవడంలో వైసిపి విజయం సాధించిందని అనుకోవాలి.