కందుల రమేష్
కమ్యూనిస్టులని కూడా తలదన్నే కొత్త నాయకుడు దేశంలో అవతరించాడు.
ఆయన పేరు ఎడుగూరి సందింటి జగన్ మోహన్ రెడ్డి.
వర్గ పోరాటం గురించి ఒకటే ఉపన్యాసాలు దంచుతున్నాడు ఈ మధ్య.
ఏంటీ వర్గ పోరాటం అంటే?
కారల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఏంగెల్స్ అనే వాళ్లు ఈ వర్గ పోరాటం అనే థియరీని కనిపెట్టారు.
సమాజంలో డబ్బులున్న వాళ్లు, లేని వాళ్లు ఉంటారు. వీరిద్దరి మధ్య పోరాటం తప్పదు.
ఆ పోరాటంలో పేదలు గెలిచి, సమసమాజాన్ని స్థాపిస్తారు.
అదీ ఈ సిద్దాంతం అన్నమాట.
రష్యాలో లెనిన్, స్టాలిన్ లు, చైనాలో మావో సేటుంగ్ వర్గపోరాటం చేసి ఆ దేశాల్లో సమసమాజాన్ని తీసుకొచ్చారు.
కనీసం తీసుకొచ్చారని అప్పట్లో అందరూ అనుకున్నారు. ఆ తర్వాత కాదని తేలిపోయింది, అది వేరే విషయం.
ఇన్నాళ్లకి, ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ మరో కారల్ మార్క్స్, మరో మావో సేటుంగ్ జన్మించారు.
పేదల తరఫున పోరాడి, అధికారాన్ని మళ్లీ దక్కించుకోటానికి ఈ అభినవ మార్క్స్, అభినవ మావో సర్వశక్తులూ ఒడ్డుతున్నాడు.
అయితే ఒకటే చిక్కు.
వర్గ పోరాటాన్ని అధికారంలో ఉన్నవాళ్ల మీద, అణగారిన వర్గాలైన కార్మికులు, కర్షకులు చేస్తారు. అధికారంలో ఉన్నవాళ్లని భౌతికంగా అంతమొందించి, కార్మికుల ప్రభుత్వాన్ని, కర్షకుల ప్రభుత్వాన్ని, పేదల ప్రభుత్వాన్ని, బీదల ప్రభుత్వాన్ని స్థాపిస్తారు.
కాని ఇక్కడి వ్యవహారం వేరు. జగన్ మోహన్ రెడ్డేమో పదవిలో ఉన్నాడు. అంతులేని అధికారాన్ని అనుభవిస్తున్నాడు. వ్యవస్థల మీద తిరుగులేని పెత్తనాన్ని చెలాయిస్తున్నాడు. వ్యతిరేకుల్ని ఉక్కుపాదంతో అణచివేస్తున్నాడు.
ఆంధ్ర దేశంలో అసంఖ్యాకంగా ఉన్న బీదసాదలతో ఆయనకి పోలికే లేదు.
ఏపిలో సగటు మనిషికి నెలకి 18 వేల రూపాయల కంటే తక్కువ ఆదాయం ఉంది.
మరి జగన్ మోహన్ రెడ్డి గారి ఆదాయం ఎంత?
2019 ఎన్నికల సందర్భంగా ఆదాయపు పన్ను శాఖకి ఆయన వ్యక్తిగతంగా చూపించింది నెలకి జస్ట్ 2 కోట్ల 18 లక్షలు మాత్రమే.
ఆయన భార్య భారతి గారికి నెలకి మరో కోటి రూపాయలు వస్తోందని చూపించారు.
అంటే ఇద్దరికీ కలిపి, నెలకి ఏకంగా 3 కోట్ల 18 లక్షల రూపాయలు ఆదాయం వస్తోందన్న మాట.
నెలకి 18 వేలు ఎక్కడా? నెలకి 318 లక్షల రూపాయలెక్కడా అని మీరు, నేను నోరెళ్లబెట్టవచ్చు.
ఆయన మాత్రం నేను ముఖ్యమంత్రిగా నెలకి తీసుకునే జీతం రూపాయేగా అని అంటారు.
ముఖ్యమంత్రిగా బరువైన బాధ్యతలు నిర్వర్తించటానికి జగన్ మీద ప్రభుత్వం నెలకి సగటున కోటి రూపాయలకి పైగా ఖర్చుపెడుతోంది.
అందువల్ల ఆయనకి, ఆయన భార్యకి కలిపి నెలకి వచ్చే 318 లక్షల రూపాయల్లో పైసా ఖర్చుపెట్టే పనిలేదు.
ఇక ఆయన చెప్పిన ప్రకారమే, జగన్ గారి వ్యక్తిగత ఆస్తి 2019 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం, అక్షరాలా 510 కోట్ల రూపాయలు.
ఆయన భార్య ఆస్తి, అదే అఫిడవిట్ ప్రకారం, మరో 74 కోట్ల రూపాయలు.
జగన్ గారి ఆస్తి ఇంకా ఎన్నో రెట్లు ఎక్కువని, తక్కువ చేసి చూపిస్తున్నారని గిట్టనివాళ్లు ఆరోపిస్తుంటారు.
ఉదాహరణకి హైదరాబాద్ లోటస్ పాండ్ ఇంటి విలువని ఆయన 3 కోట్ల రూపాయలని చెప్పాడు.
ఆ ఇల్లు 5,807 చదరపు గజాల్లో ఉంది.
ఒక్క స్థలం విలువే వంద కోట్ల రూపాయలకి పైగా ఉంటుందని అందరికీ తెలుసు,
అట్లాగే, బెంగుళూరులో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కి దగ్గరలో 23 ఎకరాల్లో ఉన్న ప్యాలెస్ ని జగన్ తన అఫిడవిట్లో చూపలేదు. అది ఎవరి పేరు మీద ఉందో తెలియదు.
ఈ ఇంద్ర భవనం జగన్ దేనని సిబిఐ వారు ఆరోపించారు.
ఇక ఆయనకున్న సిమెంటు కంపెనీలు, మీడియా కంపెనీలు, ఇతర కంపెనీల గురించి వదిలేద్దాం.
ఎందుకంటే ఒక్క భారతి సిమెంట్ లో సగం వాటా అమ్మితేనే అప్పట్లో 2 వేల కోట్ల రూపాయలకి పైగా వచ్చిందని సమాచారం.
సో, ఆస్తుల అసలు విలువ, గట్రా జోలికి వెళ్లకపోయినా, ఒక్కటి మాత్రం నిజం.
ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ధనవంతుడైన ఎంపిగా 2011 లో, అలాగే దేశంలోనే అత్యంత ధనవంతుడైన సిఎంగా 2023లో గుర్తింపు పొందిన రాజకీయ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి.
మరి, అలా సిరిసంపదలతో తులతూగుతున్న జగన్, వర్గ పోరాటం గురించి మాట్లాడుతుంటే మనం అవాక్కవ్వాల్సిందే.
జగన్ చెప్పే ఈ కొత్త వర్గ పోరాటానికి అర్థం ఏమిటి?
దేశంలో అత్యంత ధనవంతుడైన సిఎంగా నా పేరే కలకాలం ఉండాలి.
దానికి అడ్డువచ్చేవాళ్లు కులపిచ్చిగాళ్లు, దానికి అడ్డువచ్చే మీడియా ఎల్లో మీడియా.
దానికి అడ్డువచ్చే పార్టీలు పెట్టుబడిదారీ, కార్మికవర్గ వ్యతిరేక పార్టీలు.
దానికి అడ్డువచ్చే ఓటర్లు అభ్యుదయ వ్యతిరేకులు. పేదల శత్రువులు.
నాఈ వర్గ పోరాటంలో పేదల సంఖ్యని ఇంకా పెంచుకుంటూ పోతాను.
వాళ్లంతా నాకు సైనికుల్లాగా అండగా ఉండి, పోరాడి, ఈ వర్గ పోరాటంలో నన్ను గెలిపించాలి.
మళ్లీ అధికారంలోకి వచ్చి శత్రుశేషాన్ని నిర్మూలించి, ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలిస్తాను.
కనీవినీ ఎరుగని ధనరాశుల్ని పోగుచేసుకుంటాను.
అది చూసి, మీ పేదల కడుపులు నిండిపోవాలి.
నా ప్రత్యర్థుల గుండెలు మండిపోవాలి.
అది జగన్ వర్గపోరాటానికి అసలు అర్థం.