2024 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే అని ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ పరకాల ప్రభాకర్ వ్యాఖ్యానించారు.
మోడీ పాలన యావత్తు ప్రజల్లో విభజన భావాలను వ్యాప్తి చేయడం కోసమే నిమగ్నమయిందని, ఆర్థిక వ్యవస్థ, ఇతర విషయాల్లో పూర్తి అసమర్థతతో ఉందని ఆయన విమర్శించారు.
డాక్టర్ ప్రభాకర్ రచించిన పుస్తకం ‘ది క్రూకెడ్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా: ఎస్సేస్ ఆన్ ఎ రిపబ్లిక్ ఇన్ క్రైసిస్’ ను ఈ నెల 14 ఆదివారం నాడు బెంగళూరులో ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని స్పీకింగ్ టైగర్ సంస్థ ప్రచురించిoది.
ఈ పుస్తకంలో దేశ ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలు, ఇతర సమస్యలపై మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై వ్యాసాలు ఉన్నాయి.
డాక్టర్ పరకాల ప్రభాకర్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త. ఇటీవలి కాలంలో ఆయన ది హిందూ వంటి పత్రికల్లో మోడి ప్రభుత్వంపై విమర్శనాత్మక వ్యాసాలు రాశారు. వైర్ వంటి వెబ్ సైట్లలో బిజెపి ప్రభుత్వ అసమర్థతపై ఇంటర్వ్యూలు ఇచ్చారు.
2014 ఎన్నికల్లో అభివృద్ధి నినాదంపై విజయం సాధించినా, తరువాత నుంచి బీజేపీ హిందుత్వవాదాన్ని అనుసరిస్తోందని, లౌకికవాదాన్ని పూర్తిగా విస్మరించిందని పేర్కొన్నారు. 2024లో మోడీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే,కేవలం దేశ ఆర్థిక వ్యవస్థకే కాకుండా యావత్తు దేశానికే విపత్తు అని పరకాల ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజల మధ్య విభజనతో లాభం పొందాలని మోడీ ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. తన పోరాటం హిందువులు-ముస్లింల మధ్య కాదని, పేదరికం, నిరుద్యోగానికి వ్యతిరేకంగా హిందువులు, ముస్లింలు కలిసి చేసే పోరాటమని ప్రభాకర్ తెలిపారు. “బీజేపీ, మోడీలు హిందుత్వం కోసం పాకులాడుతుంటే వారిని ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది” అని ప్రభాకర్ పిలుపునిచ్చారు.
ప్రభుత్వాల లక్ష్యం విభజనలను రూపుమాపడం, సామరస్యాన్ని పెంపొందించడంగా ఉండాలని చెప్పారు.
అలాగే మోడీ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను తప్పుగా నిర్వహిస్తోందని విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు విషయంలో మోడీ ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. అర్థిక శాస్త్రంలో ప్రాథమిక శిక్షణ పొందిన ఏ ఆర్థిక వేత్తయినా, ఇంత పెద్ద స్థాయిలో, ఇంత తక్కువ నోటీసు సమయ వ్యవధిలో పెద్ద నోట్ల రద్దుకు సిఫార్సు చేసి ఉండరని ప్రభాకర్ విమర్శించారు. నోట్ల రద్దు పెద్ద తప్పిదమని, తదనంతరం తీసుకున్న తప్పుడు విధానాలు ఈ తప్పిదాన్ని మరింతగా పెంచి సంక్షోభాన్ని, మరింత తీవ్రతరం చేశాయని ప్రభాకర్ విమర్శించారు.
యాపిల్ షోరూమ్లు, లేదా ఫాక్స్కాన్ ఉత్పత్తి చేసే ఫోన్లు నిజమైన ఆర్థిక పురోగతికి సూచికలు కావని తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో విడుదల చేసిన ఆక్స్ఫామ్ నివేదికలో భారత్లో పెరుగుతున్న అసమానతలు, సంపద కేంద్రీకరణను ఎత్తి చూపిన విషయాన్ని గుర్తు చేశారు. మోడీ పాలనలో ఈ ప్రక్రియ వేగవంతమైందని, అధిక సంఖ్యలో భారతీయులు పేదలుగా మారారని ప్రభాకర్ తెలిపారు.