ప్రత్యేక ప్రతినిధి
తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగా చట్టం కన్నుగప్పి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కాజేశారని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద ఆరోపణలు ఉన్నాయి.
ఇప్పుడు దర్జాగా చట్టప్రకారమే వందల కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని తనకు తానే ఇచ్చేసుకున్నారు ముఖ్యమంత్రి జగన్.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో అత్యంత విలువైన ప్రజల ఆస్తిని వైసీపీ కార్యాలయాల కోసం లీజుల పేరుతో ఆయన తీసేసుకున్నారు.
గమ్మత్తేంటంటే, గతంలో చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన అనేకానేక నిర్ణయాల్ని తిరగదోడిన జగన్, పార్టీ కార్యాలయాలకి ప్రభుత్వ భూమిని ఇస్తూ టిడిపి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోని మాత్రం తనకు అనుకూలంగా పిండుకున్నారు.
ఈ జీవోని అప్పట్లో ప్రతిపక్షనేతగా ఉన్న జగన్ తీవ్రంగా వ్యతిరేకించారు. తమ పార్టీ కార్యాలయాల కోసం ఈ జీవో ప్రకారం భూములు తీసుకునేది లేదని స్పష్టం చేశారు. కాని అధికారంలోకి వచ్చాక ఆయన వైఖరి మారిపోయింది.
రాష్ట్రంలోని 26 జిల్లాల్లో వైసీపీ కార్యాలయాల నిర్మాణం కోసం ఎకరాకు ఏటా వెయ్యి రూపాయల చొప్పున రెండేసి ఎకరాలను 33 ఏళ్ల లీజుకు వైసిపి పార్టీకి వైసిపి ప్రభుత్వం రాసి ఇచ్చింది.
జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలు కార్యాలయాలు ఏర్పాటు చేసుకునేందుకు 2016 జులై 21 న అప్పటి టిడిపి ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చింది. అంతకుముందు 1987 లో దీనికి సంబంధించి తీసుకొచ్చిన పాలసీలో మార్పులు చేస్తూ ఈ కొత్త జీవోనిచంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చింది.
దీని ప్రకారం, రాజధాని నగరంలో రాజకీయ పార్టీలకి మూడు కేటగిరీల్లో ప్రభుత్వ భూమిని కేటాయించవచ్చు.
జాతీయపార్టీ గాని, రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రాంతీయపార్టీ గాని శాసనసభలో 50 శాతం ఎమ్మెల్యే సీట్లని కలిగివుంటే, వాటికి నాలుగు ఎకరాలు కేటాయించవచ్చు.
ఈ పార్టీలకి 25 నుంచి 50 శాతం వరకు ఎమ్మెల్యే సీట్లు ఉంటే అరెకరం వరకు కేటాయించవచ్చు. అదే 25 శాతానికి కూడా తక్కువుంటే, అటువంటి పార్టీలకి వెయ్యి గజాల వరకు స్థలం కేటాయించవచ్చు.
ఈ జీవో ప్రకారం, జిల్లా కేంద్రాల్లో కూడా రాజకీయపార్టీల కార్యాలయాల కోసం భూమిని కేటాయించవచ్చు.
అసెంబ్లీలో 50 శాతానికి పైగా ఎమ్మెల్యేలు ఉన్న జాతీయ, ప్రాంతీయ పార్టీలకి జిల్లా కేంద్రాల్లో రెండు ఎకరాల వరకు స్థలం ఇవ్వవచ్చు.
ఆయా పార్టీలకి 25 శాతం నుంచి 50 శాతం వరకు ఎమ్మెల్యేలు ఉంటే వెయ్యి గజాల వరకు జిల్లా కేంద్రాల్లో స్థలాలు కేటాయించవచ్చు.
25 శాతం కంటే తక్కువ ఎమ్మెల్యేలు ఉన్న పార్టీలకి జిల్లా కేంద్రాల్లో 300 గజాల వరకు స్థలం కేటాయించవచ్చు.
ఈ భూముల్ని లీజు ప్రాతిపదిక మీద కేటాయిస్తారు. తొలుత 33 ఏళ్ల వరకు ఆ పార్టీల పేరు మీద లీజుకి ఇస్తారు. తర్వాత ఈ లీజుని 99 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు. అంటే పేరుకి లీజైనా, ఆయా పార్టీలకి ఈ భూముల్ని శాశ్వతంగా ఇచ్చేసినట్టే.
ఇక రాజకీయ పార్టీలకి ఇట్లా ఇచ్చే భూములకి అద్దె ఎంత? ఎకరానికి ఏడాదికి అక్షరాలా వెయ్యి రూపాయలు.
అందుకనే ఇప్పుడు 26 జిల్లాలో 52 ఎకరాల భూమిని వైసిపి తనకు తాను కేటాయించుకుంటే, కట్టే అద్దె ఎంతో తెలుసా? ఏటా ఎకరాకు వెయ్యి చొప్పున మొత్తం 52 ఎకరాలకి కలిపి 52 వేల రూపాయలు మాత్రమే.
ఇక ఇలా రాష్ట్రవ్యాప్తంగా తీసుకున్న భూమి ఎంత విలువైనదో అర్థం చేసుకోవాలంటే, విశాఖనే తీసుకోవచ్చు. విశాఖపట్నంలో ఎండాడలో తీసుకున్న రెండెకరాల భూమి ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువే 40 కోట్లు. మార్కెట్ ధర వంద కోట్ల వరకు ఉంటుందని అంచనా.
అలాగే విజయవాడ, రాజమండ్రి, తిరుపతి వంటి రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో జగన్ తన పార్టీ పేరు మీద రెండెకరాలు తీసుకున్నారు.
ఈ లెక్కన మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ద్వారా కేటాయించుకున్న భూముల విలువ వేల కోట్లలో ఉంటుంది.
పనిలో పనిగా, అంతకుముందు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు వారు తమ పార్టీకి కొన్ని జిల్లాల్లో కేటాయించుకున్న భూమిని కూడా జగన్ ప్రభుత్వం వెనక్కి తీసుకొంది.
జగనా, మజాకా!